Upavachakam, 3 mana pandugalu
1)తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది? దానిని ఎప్పుడు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు?
జ:తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. దీనిని పూల పండుగ అని కూడా పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్ నెలల ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలుగు నెలల ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని తొమ్మిది రోజులు జరుపు కుంటారు. తొమ్మిది రోజులు బతుకమ్మను రకరకాల పూలతో పేరుస్తారు. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. రంగు రంగుల పూలతో బతుకమ్మను పిరమిడ్ ఆకారంలో పేర్చి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతారు. గౌరమ్మకు ప్రతి రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాలను పెడుతూ చివరకు బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
2) బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏమిటి?
జ: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మకు ఎన్నో వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. చోళ రాజు అయిన ధర్మాంగదుడికి వందమంది కుమారులు ఉంటారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయనకు ఒక ఆడపిల్ల పుడుతుంది. చాలా రోజులకు పుట్టిన ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలందుకుంటున్నది.
బతుకమ్మ తయారీలో ముఖ్యంగా ప్రకృతిలో సహజంగా లభించే పువ్వులను వాడుతారు. ప్రత్యేకించి గునుగు, చామంతి, తంగేడు, కట్లపూలు, ఎర్రగన్నేరు,పచ్చ గన్నేరు, రుద్రాక్ష, గుమ్మడి, బంతి, బీరా, ముద్ద బంతి వంటి రకరకాల పూలను సేకరించి రంగురంగులుగా పేర్చి దానిపై పసుపుతో చేసిన గౌరీదేవిని ఉంచుతారు. ఇలా పేర్చిన బతుకమ్మను ఆడవార౦దరూ పసుపుకుంకుమలతో పూజించి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ప్రతిరోజు రకరకాల నైవేద్యాలను పెడతారు. తర్వాత బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా ఆ పూలలోఉండే ఔషథ గుణాలు నీరు కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా తొమ్మిది రోజులూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండుగ ద్వారా ఐక్యత పెరుగుతుంది.
3) తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే మరికొన్నిపండుగలను గురించి రాయండి.
జ: తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ కాకుండా హోళీ పండుగ, మిలాదున్నబీ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. వసంతఋతువు రాకతో ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. కొత్తకొత్త పూలతో ప్రకృతి అందంగా ఉంటుంది. ఆ సమయంలో జరుపుకునే రంగుల పండుగే హోళీ. హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ప్రతి ఏడు ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ పండుగను కాముని పున్నమి అని కూడా పిలుస్తారు. కామదహనం తర్వాత బూడిదను పొలాల్లో చల్లడం ద్వారా పంటలు బాగా పండుతాయని ప్రజలనమ్మకం. ఈ హోళీ పండుగకు మోదుగు పూలు, ఇంకా రకరకాలపూలు తెచ్చి నీటిలోఉడికించి రంగుగా తయారు చేసుకుని ఒకరిపై ఒకరు చల్లుకొని ఆనందిస్తారు. హోళీ పండుగకు ముందు పది రోజుల నుండి గ్రామాలలో హోళీ పాటలు మారు మోగుతాయి. ఈ పాటలన్నీ జానపద బాణీలో ఉంటాయి.
“మిలాదున్నబీ” ఇది మహమ్మదీయులు అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ మిలాదున్నబీ రోజున మహమ్మదీయులు తమ మత ప్రవక్త జన్మదినాన్నివేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదుకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు.