గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు
అర్థాలు
గోచరించుటు = కనిపి౦చుట
పుష్కలము = అధికము
మక్కువ = కోరిక
ఇ౦చుమి౦చు = దాదాపు
మనోహరము = అందము
పురాతనము = ప్రాచీనము
ఆసక్తి = ఆపేక్ష, ఆస
శోభ = కాంతి, ఇచ్చ
ప్రకృతి -వికృతి
పండుగ - పబ్బము
పూర్ణిమ - పున్నమి
జీవితం - జీతం
కార్యము - కర్ణము
కవి పరిచయం:-
రచయిత : దేవులపల్లి రామానుజరావు (కాలం:- 1917–1993)
ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతలలో ఒకరు దేవులపల్లి రామానుజరావు. జాతీయ పునరుజ్జీవన కార్యకర్త. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత. దేవులపల్లి వరంగల్ సమీపంలోని దేశాయిపేట గ్రామంలో జన్మించారు. 1946లో శోభా సాహిత్య మాస పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంత కాలం నడిపించాడు. తెలుగు సాహితీ వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఆయన రచనలు. “50 సంవత్సరాల జ్ఞాపకాలు” ఈయన ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు.
ప్రశ్నలు – జవాబులు
1. స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
జ: స్త్రీల పాటలు వలన పిల్లలకు, స్త్రీలకు ఆనందం కలుగుతుంది. స్త్రీలు పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు, నిద్రపుచ్చే టప్పుడు 'చందమామ రావే జాబిల్లి రావే’ ‘లాలి లాలి’ వంటి జోల పాటలు పాడితే ఆనందం కలుగుతుంది. ఆటలు ఆడేటప్పుడు ఆ పాటలో రాగానికి, తాళానికి అనుగుణంగా ఆడుతుంటే మంచి ఉత్సాహం వస్తుంది. ఏడిచే పిల్లల్ని ఊరుకో పెట్టటానికి పాడే పాటల వలన ఏడుపు ఆపేస్తారు. శుభకార్యాలప్పుడు పాడే పాటలకు పిల్లలు నృత్యాలు చేస్తారు. అప్పుడు అందరు కూడా ఆనందపడతారు. పిల్లలే కాదు స్త్రీలు కూడా వివిధ సమయాల్లో ఈ పాటలను పాడుకుంటూ ఆనందంగా గడుపుతారు.
2. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ మీ అభిప్రాయం రాయండి.
(లేదా )
క్రీడా వినోదాల వల్ల లాభాలు ఏమిటి?
జ: క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరం అంటే క్రీడల వలన మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం దృఢపడుతుంది. “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నారు పెద్దలు. పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగినవారు జీవితంలో దేన్నైనా సాధించగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. క్రీడలు, వినోదాలు వలన కలిగే మానసిక ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఉత్సాహంగా, ఆసక్తిగా చేసే పనుల వలన విజయం మన సొంతమవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అలాగే క్రీడలు, వినోదాల వలన మానవ సంబంధాలు కూడా బలపడతాయి, గెలుపు- ఓటములు విలువలను తెలుసుకుంటూ, క్రీడాస్ఫూర్తిని అలవరచుకుంటూ, మరిన్ని మెళుకువలను నేర్చుకుంటూ, మనల్ని మనం సిద్ధ పరుచుకుంటాం. అందుకే క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి అవసరం.
3) గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది ? ఎందుకు?
జ: గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇది తెలుగువారి ప్రత్యేకత. ఒక సన్నని బట్టను తెరగాకట్టి దాని వెనక దివిటీలు వెలిగిస్తారు. తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ బొమ్మలను ఆడిస్తారు. ఇవి ఎక్కువగా రామాయణ, భారత కథలకు చెందినవి వుంటాయి. వీటి ద్వారా ప్రజలకు ఆనందంతో పాటు నీతికూడా తెలుస్తుంది. కాబట్టి అందరూ దీనిని ఇష్టపడేవారు.
4) గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
జ: గ్రామీణ ఉత్సవాలలో ఆటకి పాటకి ప్రాధాన్యత ఎక్కువగా వుండేది.వాటిలో ముఖ్యంగా యక్షగానం, తోలుబొమ్మలాట, వీధినాటకాలు మొదలైనవాటి ద్వారా కృష్ణ లీలలు, భారత, భాగవత కథలు, బొబ్బిలి కథలు, బాలంగమ్మ కథలు వంటివి పిల్లలు పెద్దలు అందరు కలిసి చూసేవారు. దాని వల్ల వారిలో న్యాయ, ధర్మాలకు సంబంధించిన జ్ఞానం పెంపొందేది.
5) నాటికి నేటికి క్రీడా వినోదాలలో తేడా ఏమిటి?
జ: నాటికాలంలో పిల్లలు ఆడే ఆటలలో చాలా వినోదంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసం కూడా వుండేవి. గిల్లిదండు( చిర్రగోనె) బొంగరాల ఆట, వామన గుంటలు, పచ్చీసు, గుర్రపు స్వారి, మల్లయుద్ధం వంటివి ఆడేవారు. నేటి తరం వారు కేవలం వీడియో గేములు, టివీ లకు పరిమితమవుతున్నారు. అందువల్ల వీరు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోల్పోతున్నారు.
నీపేరు శివ. గ్రామీణ కళాకారులను ప్రశ౦సిస్తూ మీ మిత్రుడు రాముకు లేఖ రాయుము.
లేఖ
రామన్నపేట,
28-05-21.
ప్రియమైన మిత్రుడు రాముకు,
నీ స్నేహితుడు శివ వ్రాయునది, నేను క్షేమము. నీవు ఎలా వున్నావు? ముఖ్యంగా వ్రాయునది ఏమనగా నేను ఈసారి వేసవి సెలవులకు మా తాతగారింటికి వచ్చాను. ఇక్కడ రామలయంలో ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా తోలుబొమ్మలాటలు, హరికథలు, గారడీ విద్యలు, కుస్తీ పోటీలు నిర్వహించారు. గ్రామాలలో ప్రాచుర్యం పొందిన ఈ ఆటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఆటలలో గ్రామీణ కళాకారుల నైపుణ్యం చాలా బాగుంది. నేను అక్కడకు వచ్చిన తరువాత మిగతా విశేషాలు తెలియచేస్తాను. మీ అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.
ఇట్లు,
నీ మిత్రుడు
బీ శివ
చిరునామా:
కె. రాము,
S/౦ కె.చలపతిరావు,
డో.నే౦ 31/27-3/8,
శివాలయం వీధి,
నల్గొండ,
తెలంగాణ.