Exam Preparation Tips For 10th Class

విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత శ్రీ లావు రత్తయ్య గారు పదో తరగతి పరిక్షలు వ్రాయుచున్న విద్యార్థులకు అందించిన సలహాలు, సూచనలు వారి మాటల్లోనే

 Exam Preparation Tips For 10th Class
updated time: 07-06-2022 @ 10:00 AM Leave a comment: Exam Preparation Tips For 10th Class

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పిల్లలకు విలువైన విద్యను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవనీయులైన పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నమస్కారములు. విద్యార్థులకు శుభాకాంక్షలు…

నా పేరు డాక్టర్ లావు రత్తయ్య. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేతగా నేను మీ అందరికీ సుపరిచితుడనే. మరో నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయబోతున్నందున విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 4దశాబ్దాలకు పైగా విద్యా రంగంలోనే కొనసాగుతున్న మాకు ఎదురైన పలు అనుభవాలు, పరీక్షల సమయంలో లక్షలాది మంది విద్యార్థుల మానసిక పరిస్థితులను పరిశీలించిన వ్యక్తిగా నేను గమనించిన కొన్ని విషయాలు, విద్యార్థులకు మార్కుల శాతం పెంచేందుకు మేము పాటించిన పలు అంశాలను నేను మీకు వివరిస్తాను.

నేను ఇక్కడ ప్రస్తావించనున్న అంశాలను విద్యార్థులు తూ.చా. తప్పకుండా పాటిస్తే.. ఉపాధ్యాయులు వాటిపై దృష్టి నిలిపితే సాధారణంగావచ్చే మార్కుల కంటే 10శాతం నుంచి 15 శాతం వరకు ఎక్కువ వచ్చేలా చెయ్యొచ్చు.

ఈ నెల రోజులు ఎంతో కీలకం

పదో తరగతి విద్యార్థులు చివరి పరీక్షలు రాసేందుకు ఇక మిగిలింది నెల రోజులే. ఈ ఏడాది మొత్తం చదివింది ఒక ఎత్తయితే.. ఈ నెల రోజులు చదవడం మరో ఎత్తవుతుంది. ఈ 30 రోజులు ప్రణాళిక ప్రకారం చదవాలి. నెల రోజుల సమయం ఉంది కదా.. అని అనుకోవడానికి వీల్లేదు. ఇదే సమయాన్ని మరో కోణంలోంచి చుస్తే ఒక్కో సబ్జెక్టు చదవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రధానంగా నాలుగు సూత్రాలున్నాయి. విద్యార్థులు శాస్త్రీయంగా చదివితే విజయాన్ని సునాయాసంగా అందుకోవచ్చు.

1. లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

విద్యార్థులు ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అసలు మనకు ఎన్ని మార్కులు రావాలనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక్కో సబ్జెక్టులో 70 శాతం మార్కులు వస్తున్నాయంటే.. ఆ విద్యార్థి ఖచ్చితంగా 80 శాతం మార్కులకు తక్కువ కాకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యాన్ని రోజూ గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఆ లక్ష్యం సఫలమయ్యే దిశగా సాగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఓ విద్యార్థిని పరిగెత్తండి.. పరిగెత్తండి.. అంటే దానికి అర్థం ఉండదు. వంద మీటర్లు పరిగెత్తండి అంటే అర్థం ఉంటుంది. వంద మీటర్లు పది సెకన్లలో నిర్దేశించుకుని విజయాన్ని సాధించాలి.

2. చివరి దశలో చదవాల్సిన తీరు..

ఒక ఆధ్యాయం చదివే ముందు ఐదు లేదా ఆరు నిమిషాలు.. గతంలో ఆ అధ్యాయంలో ఏం చదివామనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఈ ప్రయత్నంలో కొంత సేపటి తర్వాత ఆ చాప్టర్ లోని 60 నుంచి 70 శాతం విషయం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత మాత్రమే చదవడం మొదలుపెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆ అధ్యాయంలో ఏ విషయాలైతే మీకు గుర్తుకు రాలేదో ఆ అంశాల వైపు మీ మెదడు దానంతటదే దృష్టి పెడుతుంది. మీకు గుర్తుకురాని డెఫినేషన్లు ఏమైనా ఉంటె ఒకటికి రెండు సార్లు రాసుకుంటూ ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది.

రెండో అధ్యాయం చదివే ముందు కూడా ఇదే పద్దతిని అనుసరించాలి. ఇలా చేస్తే మీరు చదివే అన్ని అధ్యయలపై పట్టు వస్తుంది. అప్పటికి ఏదైనా ఒక పది శాతం సబ్జెక్టు మీకు గుర్తుకురాకపోతే.. ఆ విషయంలో మీకు ఏవో సందేహాలు ఉన్నట్లు లెక్క వెంటనే ఉపాధ్యాయుడి వద్ద సందేహాలను నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే 70 శాతం మార్కులు వచ్చే విద్యార్థులు కూడా 90 శాతం మార్కులు సాధించవచ్చు. ఏ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

3. ప్రశ్నాపత్రాలపై భయాలు పెంచుకోవద్దు

పరీక్షలు సమీపించే కొద్ది పరీక్షలు ఎలా రాస్తామా అని విద్యార్థులైన మీకు, ఎలా రాస్తారో..అని ఉపాధ్యాయులకు భయం కలుగుతూ ఉంటుంది. ఈ భయానికి కారణాలేంటని ఆలోచిస్తే.. మనకు రెండు విషయాలు తడతాయి. పరీక్షలో మనకు తెలిసిన ప్రశ్నలే వస్తాయా.. అనే సందేహం ఒకటైతే .. మనకు తెలిసిన ప్రశ్నలే వచ్చినా సమాధానాలను గుర్తుంచుకుని రాయగలమా.. అనేది రెండో భయం. విద్యార్థులు ఈ రెండు భయాలను పోగొట్టుకోవాల్సినవసరం ఎంతైనా ఉంది.

ఈ ప్రశ్నాపత్రం అయినా సరే 60 నుండి 70 శాతం వరకు సగటు విద్యార్థులకు అనుకూలంగానే వస్తుంది. ఎంత కష్టంగా ఉన్న పేపర్ అయినా సరే.. దాని తీవ్రత కేవలం 20 శాతం వరకు మాత్రమే ఉంటుంది. చాలా ప్రశ్నలు మీకు తెలిసినవే..మీరు చదివినవే వస్తాయి. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడేవాడిలో ముఖ్యంగా అసలు నేను పరీక్ష సరిగ్గా రాయగలనా అనే భయం ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవడానికి .. ప్రశ్నలకు జవాబులను పదే పదే మననం (రీకాలింగ్) చేసుకోవాలి. ఇలా మననం చేయడం అనే విషయంలో సహజంగా నాలుగు దశలు ఉంటాయి.

 • మొదటి దశ : చదవడం,
 • రెండో దశ : అర్థం చేసుకోవడం,
 • మూడో దశ : అర్థం చేసుకున్న దాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడం,
 • నాల్గవ దశ : తిరిగి దాన్ని మననం చేసుకోవడం..
 • ఇలా చేస్తే విద్యార్థులకు భయం తొలిగిపోతుంది. చదువుకున్న దాన్ని గుర్తుంచుకుని ప్రశాంతంగా పరీక్ష రాసే వీలు కలుగుతుంది.

4. మననం చేసుకోవడాన్ని అలవరుచుకోవాలి

మననం చేసుకోవడం అంటే ఉదాహరణకు నాలుగైదు రోజుల కిందట సోషల్ స్టడీస్ సబ్జెక్టు చదివారనుకుందాం.. ప్రస్తుతం గణితం చదువుకుంటున్నారనుకుందాం. ఈ సమయంలో కూడా సోషల్ స్టడీస్ విషయాలను మననం చేసుకోవాలి. అలాగే భోజనం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు, బస్సులో వెళ్లే సమయంలో ఇలా వీలు చిక్కినప్పుడల్లా నాలుగైదు రోజుల కిందట చదివిన సోషల్ స్టడీస్ ను మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ ఉండాలి. ఇలా పదే పదే చేస్తూ ఉంటే.. మూడు నాలుగు గంటల్లోనే టెక్స్ట్ బుక్ అంతా జ్ఞప్తిలోకి వస్తుంది.

మరోసారి ఇలా చేస్తే.. ఈ సారి రెండు గంటల్లోనే టెక్స్ట్ బుక్ మొత్తం గుర్తుకువస్తుంది. మరోసారి చేస్తే గంటలోనే మొత్తం మెదడులో ప్రత్యక్షమవుతుంది. ఇలా పదే పదే చేస్తే.. పిల్లలకు ధైర్యం వస్తుంది. ఏ ప్రశ్న ఇచ్చినా గణితం చదివించి, ఇంగ్లీషు పేపర్ ఇచ్చినా సరే రాసేంత ధైర్యం విద్యార్థులకు వస్తుంది. ఇలా ఈ 30 రోజులు చదివితే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

5. సరైన ప్రణాళిక అవసరం

ఇప్పుడు నేను సూచించినట్లు చేయాలని, చెప్పినట్లు చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే దీనికి సరైన ప్రిపరేషన్ కూడా అవసరమే. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెదడు పని చేయాలంటే శక్తి కావాలి. శారీరక శ్రమకు శక్తి ఎంత అవసరమో, మానసిక శ్రమకు కూడా అంటే అవసరం. కాబట్టి పిల్లలూ.. మీకు ఏది నచ్చితే అది కడుపు నిండా తినండి. ఆరోగ్యంగా ఉండండి.

6. సరిపడా నిద్ర ఎంతో అవసరం

పరీక్ష అని ఆందోళన పెంచుకోవద్దు. అలాగే హాస్టల్ లో ఉండే విద్యార్థులు కూడా అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోకూడదు. రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి. డేస్కాలర్ విద్యార్థులు రాత్రి 11 గంటల వరకు టీవీలు చూస్తూ కాలక్షేపం చేయకూడదు. అలాగే టీనేజి కాబట్టి సహచర విద్యార్థులతో చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. కానీ, పరీక్షల సమయంలో ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. మీరు ఇలాంటి వాటికీ దూరంగా ఉండి, ఎంత ప్రశాంతంగా నిద్ర పొతే మీ మెదడు కూడా అంత చురుకుగా, సమర్థవంతంగా పనిచేస్తుంది.

చాలా చిన్న విషయాలైన వీటిని పాటించడం ఎంతో అవసరం. ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయండి. ఇలా చేస్తే మీ శరీరం ఉత్సాహంగా పనిచేస్తుంది, చదువు కూడా బాగా వంటబడుతుంది.

పరీక్షలు రాసే సమయంలో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు

1. పరీక్ష రాసేముందు..

పరీక్షల సమయంలో సహజంగా విద్యార్థులు ముందు రోజు రాత్రి 12 గంటల వరకు మేలుకొని చదువుతూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. బాగా తిని నిద్ర పొతే చాలా మంచిది. శరీరానికి మెదడుకు ఎక్కువ విశ్రాంతి ఇస్తేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష అనే ఆందోళన వల్ల నిద్ర రావడం లేదని చెబుతుంటారు. ఇలాంటి వారు తొమ్మిది గంటల కల్లా తిని, పుస్తకం తీసుకుంటే నిద్ర దానంతటదే వస్తుంది. వేకువజామున 4.30, 5 గంటల కల్లా నిద్ర లేచి మళ్లీ చదువుకోవాలి. ఇలా సన్నద్ధమైతేనే ప్రభావవంతంగా పరీక్షలు రాసే వీలుంటుంది.

2. పరీక్షకు వెళ్లేప్పుడు..

పరీక్షకు వెళ్లేప్పుడు వేరే వారిపై జోక్ లు వేసుకోవడం, తిట్టుకోవడం, గొడవపెట్టుకోవడం వంటివి చేస్తే మెదడు ప్రశాంతతను కోల్పోతుంది. కాబట్టి ప్రశాంతంగా పరీక్షా కేంద్రానికి వెళ్లండి ప్రశ్నాపత్రం మీ చేతుల్లోకి రాగానే మొదటి ఐదు నిమిషాలు ప్రశ్నలన్నింటిని క్షుణ్ణంగా చదవాలి. చాలా మంది ఈ పని చేయరు. తెలివైన విద్యార్థులు కూడా దీన్ని సమయం వృథా అనుకుంటారు. అలా అనుకోవద్దు. ముందే పేపరు చదవడం వల్ల సమయం కలిసి వస్తుంది.

ఎలా అంటే.. మీరు ఇప్పుడు చదివిన సబ్జెక్టును సంబంధించి ఆ పేపరులో ఉన్న ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ విషయం తొలి ఐదు నిమిషాల్లోనే స్పష్టమైపోతుంది కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబులు మినహా.. ఆ సబ్జేక్టులోని మిగతా విషయాలన్నీ మీ మెదడు నుంచి తొలగిపోయి కొంత ప్రశాంతత దక్కుతుంది.

ఉదాహరణకు అటామిక్ స్ట్రక్చర్ గురించి 20 పేజీలు చదివితే .. రేపు పరీక్షలో బోర్ పరిమాణు సిద్ధాంతం గురించి వస్తుంది. అప్పుడు మిగిలిన విషయాలన్నీ బయటకు వెళ్ళిపోయి ఈ ఒక్క ప్రశ్న తాలూకు జవాబు మాత్రమే గుర్తుకువస్తుంది. కాబట్టి పేపరు మొత్తం ముందే చదివేస్తే.. ఆ పేపరులోని ప్రశ్నల తాలూకు జవాబులు మాత్రమే మెదడులో ఉంది మిగితావి పక్కకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది.

3. జవాబులు ఇలా రాయాలి..

ప్రశ్న పత్రంలో సహజంగా మీకు బాగా తెలిసిన, కొంచెం అలోచించి రాయాల్సిన, కొంచెం కష్టంగా ఉన్న ప్రశ్నలూ ఉంటాయి. ముందు తెలిసిన ప్రశ్నలన్నింటికి అందంగా జవాబులు రాయండి. ఆలోచించి రాయాల్సిన ప్రశ్నల విషయంలో మూడు సార్లు ఆ ప్రశ్నలను చదవండి. ఎప్పుడైనా ఒకసారి మీ టీచర్ చెప్పిన విషయాలుగాని, మీరు ఏదో ఒక సందర్భంలో చదివిన విషయాలు గాని మీకు గుర్తుకొస్తాయి.

కష్టమైన ప్రశ్నలు, తెలియని ప్రశ్నలను పూర్తిగా వదిలేసే బదులు మీకు మైనస్ మార్కులు ఎటూ లేవు కాబట్టి... మీకు ఏ చాప్టర్ నుంచి ఆ ప్రశ్న ఇచ్చారో.. ఆ చాప్టర్ లో మీకు తెలిసిన విషయాలను రాయండి. ఇలా రాశాక చివరి 20నిమిషాల్లో జవాబు పత్రం మొదటికి రండి. మీరు రాసిన జవాబుల్లో ముఖ్యమైన అంశాలు, డిఫినేషన్లు, ప్రాబ్లమ్స్ కు సంబంధించి మీరు ఇచ్చిన జవాబులను చక్కగా అండర్ లైన్ చేయండి. ఏడాదంతా మీరు చదివిన విషయాన్ని మూడు గంటల్లో రాయాల్సి ఉండగా ...దాన్ని మూల్యాంకనం చేయడానికి 5నుంచి పది నిమిషాల సమయమే ఉంటుంది.

ఇంత తక్కువ సమయంలో మీ ప్రతిభను పేపరు దిద్దే ఉపాధ్యాయుడు గుర్తించాలంటే..
 • అన్ని ప్రశ్నలు రాశామని సూచించేందుకు క్వశ్చన్ నంబర్లను పెద్దవిగా వేయాలి.
 • జవాబుల్లోని ముఖ్యమైన అంశాలను అండర్ లైన్ చేసి చూపాలి.
 • ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా నాకు జవాబు వచ్చిందని అండర్ లైన్ చేసి చూపిస్తే..పేపరు దిద్దే ఉపాధ్యాయులకు పని తేలిక అవుతుంది. మీకు ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది.

అలాగే గణితం, ఫిజికల్ సైన్స్ ప్రశ్న పత్రాల్లో ప్రాబ్లమ్ ఎదురైతే వాటిని ఎలా చేయాలి.. అని ఆలోచిస్తూ కూర్చోకుండా ఆ ప్రశ్నలోని డేటా మొత్తాన్ని చక్కగా జవాబు పత్రంపై రాసి, అప్పుడు ఆలోచిస్తే .. దానికి సంబంధించిన ఈక్వేషన్ గుర్తుకువచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ పూర్తిగా చేయలేకపోయినా.. ఆ ప్రాబ్లమ్ చాలా కష్టమైంది ఎవరూ పూర్తిచేయలేకపోయేది అయితే.. మీరు కష్టపడి ఆ ప్రశ్నను రాసే ప్రయత్నం చేశారు కాబట్టి మీకు మంచి మార్కులు రావడానికి ఆవకాశం ఏర్పడుతుంది. ఇదీ పరీక్ష రాసే పద్దతి. పరీక్ష రాశాక ఏదైనా పేపరు బాగా కష్టంగా ఉంటే..అక్కడ రెండు, మూడు మార్కులు కోల్పోతున్నామనే బాధను వదిలేసి తర్వాతి రోజు పరీక్షలో మరికొన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.

4. ఉపాధ్యాయులు ఇలా చేస్తే మంచి జరుగుతుంది

ఉపాధ్యాయులకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మీరంతా ఎంతో అనుభవం ఉన్నవారు. మీరు ఎందరో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉంటారు. ఎంతోమంది విద్యార్థులను పరీక్షలకు పంపి ఉంటారు. కాని పరీక్షల సమయంలో దయచేసి వీలైనంత వరకు వారికి శిక్షలు వేయకుండా ఉంటే మంచింది. వారిని కించపరచకుండా ప్రోత్సహిస్తూ ఉంటే మంచి ఫలితాలు దక్కుతాయి.

రోజూ రెండు సబ్జెక్టులు, మూడు సబ్జెక్టులు చదివించే బదులు ఒక్కో సబ్జెక్టును మూడు రోజులు, నాలుగు రోజులపాటు చదివించాలి. ఆ తర్వాత పరీక్ష పెట్టి వారు ఏ ప్రశ్నలకు జవాబులు రాయలేకపోతున్నారనే విషయాన్ని గుర్తిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా గమనించి, వారి లోపాలను గుర్తించి సరిచేసే అవకశం ఏర్పడుతుంది.

పిల్లలను పరీక్షల వాతావరణంలోకి తీసుకెళ్ళాలంటే పరీక్ష ముందు రోజు లేదా రెండు రోజుల ముందు వారు ఎలా అయితే ఒకే సబ్జెక్టును చదువుతారో...అలాంటి వాతావరణంలోకి వారిని ఇప్పటి నుంచే తీసుకెళ్లాలి. అందుకోసం మనం మూడు, నాలుగు రోజుల్లో పిల్లవాడు సబ్జెక్టు మొత్తాన్ని కంప్లీట్ చేసేట్టు చేయాలి ఇది మొదటి రౌండ్ తర్వాత రెండు రోజుల్లోనే సబ్జెక్టు మొత్తాన్ని కంప్లీట్ చేసేలా చూడాలి ఇది రెండో రౌండ్ ఆ తర్వాత మూడో రౌండ్ లో విద్యార్ధి సహజంగానే ఒక్క రోజులోనే సబ్జెక్టు మొత్తాన్ని పూర్తిచేస్తాడు. మీలో చాలా మంది ఇలాంటి పద్ధతినే పాటిస్తుంటారు. ఉదయం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టు, సాయంత్రం మరో సబ్జెక్టు ఇలా ఎక్కడైనా టైంటేబుల్ ను పాటిస్తుంటే.. దయచేసి మార్చుకోగలరని మనవి.

ఇలా చేయం వల్ల విద్యార్థికి ఏ సబ్జెక్టులో కూడా పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా పోతుంది. సబ్జెక్టు వారిగా డివైడ్ చేసి నాలుగు రోజులకు ఒక సబ్జెక్టు చొప్పున చదివిస్తే మంచిది.

5. ఉపాధ్యాయులు శ్రమిస్తున్న తీరు అభినందనీయం

ఈ మధ్య కాలంలో నేను చాలా పాఠశాలలను సందర్శించాను. చాలా మంది ఉపాధ్యాయులు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండి చదివిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు. మీరందించే సాయాన్ని వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇంతమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండి, బాగా రాసి విద్యార్థులు అద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.

మీరంతా బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధిస్తారని, మీకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల పేరు నిలబెడతారని, మిమ్మల్ని ఎన్నో త్యాగాలకు ఓర్చి చదివిస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నాను.

Post your comments

Your mobile number will not be published.

View Comments

 • medisettinaveen
 • 2022-June-07 10:00:17
Maths and science
 • Gorusu.venkata bhaskar
 • 2020-March-06 09:20:47
Thanks to your tips
 • peddibioina sirisha
 • 2019-March-09 12:14:22
10 calls halltkts
 • varma
 • 2019-February-22 18:06:16
thanks for your valuable tips
 • varma
 • 2019-February-22 18:05:57
thanks for your valuable tips